Sridevi's Last Rites Procession is a Record Now, Video | Oneindia Telugu

2018-03-01 835

The Last Rites of Sridevi will be remembered for a very long period. Fans turned out in huge numbers to bid tearful farewell to the evergreen beauty on Wednesday afternoon.

అర్థ శతాబ్దం పాటు తమను అలరించిన అందాల నటి శ్రీదేవి ఆఖరి పయనం ముంబైని జనసంద్రంగా మార్చింది. అశ్రు నయనాల మధ్య లక్షల్లో తరలివచ్చిన ఆమె అభిమానులు కడసారి చూపుకోసం కి.మీ కొద్ది బారులు తీరారు. వెండి తెరపై శ్రీదేవికి నీరాజనాలు పలికిన జనం.. అంతిమయాత్రలోనూ లక్షలాదిగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనంతో శ్రీదేవి అంతిమయాత్ర ఒకవిధంగా రికార్డు అనే అంటున్నారు. రాజకీయేతర వ్యక్తుల్లో ఇంతలా నీరాజనాలు అందుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా శ్రీదేవి నిలిచిపోయారు.
ముంబైలో రాజకీయేతర ప్రముఖుల అంతిమయాత్రల్లో అలనాటి గాయకుడు మహమ్మద్ రఫీదే ఆల్ టైమ్ రికార్డు అని చెబుతుంటారు. తన గాత్రంతో దేశంలోని అన్ని వర్గాలకు దగ్గరైన రఫీ కోసం.. ఆయన అంతిమయాత్రకు దాదాపు 10లక్షల పైచిలుకు జనం తరలివచ్చినట్టు చెబుతారు.
మహమ్మద్ రఫీ తర్వాత భారతీయ మొట్టమొదటి వెండితెర సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా అంతిమయాత్రకు మళ్లీ ఆ స్థాయిలో జనం తరలివచ్చారు. రాజ్‌కపూర్, వినోద్ ఖన్నాల అంతిమయాత్రల్లోనూ లక్షలాది జనం కనిపించారు.
శ్రీదేవి మరణంపై అనుమానాల సంగతెలా ఉన్నా.. ఆఖరి యాత్ర మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. అన్ని రంగాల ప్రముఖులతో పాటు ప్రధానంగా సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున తారలు తరలివచ్చారు. అమితాబ్ బచ్చన్, రేఖ, ఐశ్వర్య రాయ్, అర్బాజ్ ఖాన్, మాధూరి దీక్షిత్, అక్షయ్ ఖన్నా, టబు, ఫరా ఖాన్, నితిన్ ముఖేష్, విద్యా బాలన్, సుశ్మితాః సేన్, హేమ మాలిని తదితరలు తరలివచ్చారు.